గ్రహణం ఎప్పుడు వస్తుంది అనేది మనకి ఆధునిక శాస్త్రజ్ఞులూ తెలియచేస్తున్నారు అలానే మన పంచాంగ కర్తలూ తెలియ చేస్తున్నారు. అయితే, గ్రహణ సమయంలో పాటించాల్సిన నియమ నిభందనల గురించి మాత్రం కేవలం భారతీయ శాస్త్రం మాత్రమే చెప్తుంది. పాశ్చాత్య శాస్త్రం ఆ విషయం గురించి ఏమీ చెప్పదు
రాహువు, కేతువు అనే గ్రహాలు సర్ప రూపంలో సూర్య, చంద్రులని మింగేయ్యడం వలన గ్రహణాలు ఏర్పడతాయి, అని మన పురాణాలలో ఉన్న కథ చాలా మందికి తెలుసు. మన పురాణాలలో ఉన్న అసంబద్ధమైన విషయాలకి దీనినో ఉదాహరణగా చూపుతారు హేతువాదులు. రాహు, కేతువుల కథ అసంబద్దం అనడంలో ఎంత మాత్రం సందేహం లేదు. పాములు వచ్చి, సూర్య చంద్రులని మింగడం వలన గ్రహణం వస్తుంది అని నమ్మడం కన్నా మూర్కత్వం ఇంకోటి లేదు. ఈ విషయం అర్దం కావడానికి పెద్దగా మేధస్సు కూడా అవసరం లేదు. జన విజ్ఞాన వేదిక తదితర హేతువాద సంస్థలు కూడా ఈ విషయమై ప్రజలకి గ్రహణ సమయాలలో అవగాహన కల్పిస్తుంటాయి.
అయితే ఈ విషయాన్ని మరింత లోతుగా పరిశీలిస్తే కొన్ని ఆసక్తి కరమైన విషయాలు బయట పడతాయి. అసలు ముందు గ్రహణాలు ఎలా ఏర్పడతాయో చూద్దాం
సూర్య గ్రహణం: సూర్యుడికి, భూమికీ మధ్య చద్రుడు వస్తే, అప్పుడు చంద్రుడి నీడ భూమి మీద పడుతుంది. ఆ నీడ లో ఉన్నవారికి సూర్యగ్రహణం.
చంద్ర గ్రహణం: సూర్యుడికి, చంద్రుడికి మధ్య భూమి వస్తే, భూమి నీడ చంద్రుడి మీద పడుతుంది. సూర్యుడి కాంతి వల్లనే చంద్రుడికి ప్రకాశం కనుక, ఆ సమయం లో చంద్రుడు కనపడదు, చంద్ర గ్రహణం ఏర్పడుతుంది.
రెంటిలోనూ నీడ పడటం ప్రధానం. రాహు, కేతువులని ఛాయ గ్రహాలూ అంటారు. ఛాయ అంటే నీడ, అంటే గ్రహణ సమయం లో భూమి మీద, చంద్రుడి మీద పడే నీడలనే మన వాళ్ళు రాహువు, కేతువు అన్నారు, అన్నది స్పష్టం అవుతుంది. ఇది మొదటి విషయం. ఇక రెండో విషయం, మన వాళ్ళు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అవసరం లేకుండానే గ్రహణ సమయాలని వేల సంవత్సరాలుగా చెప్తున్నారు. ఎన్నో పురాణాలలో, రామాయణ, భారత, భాగవతాలలో గ్రహణాల గురించి ఆ సమయాలలో గ్రహ స్థితుల గురించి కనబడుతుంది. ఖగోళ శాస్త్రం మీద ఇంత లోతైన అవగాహన ఉన్నవారు, పాములు సూర్య చంద్రులని మిగేయ్యడం వలన గ్రహణం వస్తుంది అని ఎలా నమ్మరు, అనే అనుమానం సహజం
వివిధ శాస్త్రాలని, కథల సహాయంతో చెప్పడం అనే ప్రక్రియ మన పురాణాలలో చాలా ఎక్కువగా కనబడుతుంది. భారతీయ విద్యా విధానం మీద అవగాహనా ఉన్న వారికి ఈ విషయం బాగా తెలుసు. దీనినే సంకేత వాదం అంటారు. మన పురాణాల నిండా ఇవే కనబడతాయి. పులి కుక్కతో మాట్లాడినట్లు, నక్క బాతుతో మాట్లాడినట్లు ఉన్న కథలు ఇటువంటివే. మన హేతువాదులు అనుకునేటట్లు మన పూర్వీకులు ఎంత వీర్రి వాళ్లైనా మరీ కుక్క, నక్క మాట్లతాయి అనుకోరు కద. ఒక విషయాన్ని సులభంగా అర్ధమయ్యేలా చెప్పే ప్రక్రియే ఈ సంకేత వాదం. ఈ రాహు కేతువుల కథ కూడా ఇటువంటిదే.
గ్రహణ సమయంలో నియమాలు
గ్రహణ సమయంలో పాటించాల్సిన నియమాల గురించి హిందువులలో చాలా మందికి తెలుసు. గర్భిణీ స్త్రీలచే ఈ నియమాలని మన పెద్ద వాళ్ళు తప్పక పాటిమ్పచేస్తారు. గ్రహణం ఉన్న రోజున కొన్ని చానళ్లలో పండితులు గ్రహణ సమయంలో పాటించాల్సిన నియమాల గురించి చెప్తుంటే, మరి కొన్నిటిలో హేతువాదులు ఇవాన్నీ మూఢ నమ్మకాలని వాటిని పాటించనక్కర లేదని చెప్తారు. హేతువాదులు చెప్పేది కొంత వరకూ నిజమే, గ్రహణ సమయం లో మన శాస్త్రాలలో చెప్పే నియమాలు పాటించకపోతే కలిగే నష్టాల గురించిన ఏ ఆధారమూ లేదు. అయితే, అదెంత నిజమో, నష్టాలు ఉండవు అని నిరూపించడానికి కూడా ఏ ఆధారాలూ లేవు, అనేది కూడా అంతే నిజం
గ్రహణ సమయలో ప్రకృతిలో ఒక పెద్ద మార్పు జరుగుతోంది, ఆ మార్పు వలన భూమి మీద కొన్ని మార్పులు స్పష్టంగా కనబడుతున్నాయి. సముద్రపు అలలు ఎగసి పడటం ఇందులో ఒకటి. అటువంటప్పుడు గ్రహణ ప్రభావం మనిషి మీద మాత్రం ఎందుకు ఉండకూడదు? ఉంటుది అని నేను అనడం లేదు, కానీ ఉండటానికి అవకాసం ఉంది అని అంటున్నా. ఈ విషయంమై ఎటువంటి పరిశోధనా జరిగినట్లు నాకు తెలియదు. మరి అలాంటప్పుడు జన విజ్ఞాన వేదిక వంటి హేతువాద సంఘాలు వీటిని మూఢనమ్మకాలు అని ఎలా నిర్ధారించాయి?
ఈ ప్రశ్నకి వారు చెప్పే సమాధానాలు ఇవి
- గ్రహణ సమయంలో నియమాలు పాటించక పోతే నష్టాలు కలుగుతాయి అని ఏమిటి రుజువు?
- మేము ప్రతీ సారీ గ్రహణ సమయాలలో బయట భోజనం చేస్తాం. గర్భిణీ స్త్రీలు కూడా ఎందరో అలా చేస్తారు వారికేమీ కాలేదు.
నిజమే, నష్టాలు జరుగుతాయి అని సాక్షాలు లేవు, అయితే నష్టాలు లేవు అని కూడా సాక్షాలు లేవు కద? ఇటువంటి స్థితిలో రెండు వాదాలకీ సామాన ప్రాధాన్యతనివ్వడం విజ్ఞులు చెయ్యాల్సిన పని. హేతువాదులు, ఏవిధమైన హేతువూ లేకుండానే వీటిని మూఢ నమ్మకాలు, అని కొట్టి పారెయ్యడం కేవలం వారి పక్షపాత బుద్దికీ లేదా అజ్ఞానానికీ సాక్ష్యం.
మరి గ్రహణ సమయాలలో బోజనాలు చేసిన వారికి ఏమీ కాలేదు కదా, దాని సంగతి ఏంటి, అని అడగవచ్చు. సాధారణంగా హేతువాద సంఘాల వారు, గర్భిణీ స్త్రీల తో సహా గ్రహణ సమయంలో భోజనాలు చేసి, చూసారా మాకేమీ అవ్వలేదు, కాబట్టి ఇవన్ని మూఢ నమ్మకాలు అంటుంటారు. నేను కూడా ఒక వంద మందితో రాత్రంతా మధ్యం తాగించి తరువాత రోజు నిద్ర లేపి, ఇంటికి పంపి, చూసారా ఎంత తాగినా ఏమీ అవ్వలేదు కాబట్టి తాగడం వలన నష్టం లేదు, అది మూఢ నమ్మకం అంటే ఎవరైనా ఒప్పుకుంటారా? వెర్రి వాడు అంటారు. హేతువాదుల వాదన కూడా ఇలాంటిదే. ఇంకో ముఖ్యమైన విషయం, అసలు ఇటువంటి ప్రయోగాలు గర్భిణీ స్త్రీల మీద చెయ్యకూడదు. ఇవే కాదు, అసలు ఎటువంటి ప్రయోగాలూ వారి మీద చెయ్యకూడాదు. అది చట్ట వ్యతిరేకం. మరి ఈ సంఘాల వారు, ఎవరి అనుమతి తీసుకొని గర్భిణీ స్త్రీల మీద ఇటువంటి ప్రయోగాలు చేస్తున్నారో వారే చెప్పాలి.
గ్రహణ సమయంలో తినడం వలన ఎం నష్టాలు కలుగుతాయి అని శాస్త్రాలలో చెప్పారో తెలుసుకొని, తరువాత శాస్త్రీయ అధ్యయనం ద్వారా, అవి కలగలేదు అని గణాంక సహితంగా నిరూపిస్తే, అది కూడా ఒక ప్రముఖ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో జరిగితే లేదా ఏదైనా ప్రముఖ మెడికల్ జర్నల్ లో ప్రచురితం అయితే, అప్పుడు దానికి ఏదైనా విలువ, విశ్వసనీయత ఉంటుంది. అంతే కానీ వారికి వారే చేసేసుకొని, ఫలితాల్ని ప్రకటించేస్తే, వారికి అనుకూలమైన టీవీ చానాళ్ళ వాళ్ళు చూపిస్తే చూపించవచ్చు కానీ, ఇటువంటి వాటికి శాస్త్రీయ ప్రపంచంలో విలువ ఏమీ ఉండదు. ఇది పూర్తిగా అశాస్త్రీయం, అహేతుకం
అయితే మరి హేతువాదులం అని చెప్పుకునే వారు, ఇంత ఆహేతుకంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? వీళ్ళందరూ హిందూ ద్వేషులనో, దేశ ద్రోహులనో అనుకోవడం పొరపాటే. ఎవరో ఒకరిద్దరు తప్పించి హేతుబద్దంగా ఆలోచించడానికి ప్రయత్నించే వారిలో చాలా వరకూ నిజాయితీ పరులే ఉంటారు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. మరి కారణం ఏమిటి? దీనికి మూలాలు మన విద్య విధానంలో ఉన్నాయి.
విద్యా విదానం
శాస్త్రీయ ప్రగతి సమాంతరము, ప్రగతి శీలము అనేది చాలా మంది నమ్మకము. అంటే మొన్నటి కన్నా, నిన్న; నిన్నటి కన్నా ఈ రోజు శాస్త్ర పరంగా ప్రపంచం ముందు ఉంటుంది అనేది ఈ నామ్మకం సారంశం. ఇది నిరంతర ప్రక్రియ అనేది కూడా ఈ నమ్మకంలో భాగమే. ఈ సిద్ధాంతం ప్రకారం, ఇప్పటి కాలం వారి కంటే గత కాలం వారికి శాస్త్రీయ అవగాహన ఎక్కువగా ఉండే అవకాసం లేదు. మన విద్యా విధానం వలన, తమకు తెలిసో తెలియకో ఈ సిద్ధాంతం వలన ప్రభావితం అయిన వారు, మన పూర్వీకులు కొన్ని రంగాలలో ఇప్పటి కాలం కన్నా ముందుండే వారు అంటే, కనీసం ఇందులో నిజం ఎంత, అని పరిశీలించడానికి కూడా సిద్ధ పడరు. ఒక విధంగా దీనిని వారి అజ్ఞానంగా లేదా వారిలో వారికే తెలియకుండా ఉన్న ఒక్క చీకటి కోణంగా మనం పరిగణించవచ్చు. ఒక పరిమిత కాలాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటే ఈ సిద్ధాంతం నిజమే. దీర్ఘకాలం లో మాత్రం కాదు.
భారతీయ శాస్త్రాలు కాలాన్ని చూసే విధానం దీనికి పూర్తిగా విరుద్ధం. మనం కాలాన్ని సలళము అనము, చక్రీయము అంటాము. అందుకనే మన దగ్గర కాల చక్రం అనే మాట ఉంది. అందుకే మన పూర్వీకులు, కనీసం కొన్ని రంగాలలో అయినా ప్రస్తుత కాలం కంటే ముందుండే వారు అంటే మనకి మూర్కత్వం అనిపించదు. ఇప్పటికి ఎన్నో నాగరికతలు కాల గర్భం లో కలిసిపోయాయి. వాటితో పాటే వారు సాధించిన శాస్త్రీయ ప్రగతి కూడా. ఒక నాగరికతని మాత్రమే పరిగణలోకి తీసుకొని చూసినప్పుడు శాస్త్ర ప్రగతి, ప్రగతిశీలంగానే కనిపిస్తుంది, దానిని ఎవరూ వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. అయితే నాగరికతలకి అతీతంగా శాస్త్ర ప్రగతిని చూసినప్పుడు అది సరళము అనుకోవడం, తార్కికం అనిపించుకోదు. కొన్ని వేల సంవత్సరాల క్రితం అంతరించిపోయిన నాగరికతల శాస్త్రీయ పరిజ్ఞానం ఏమిటి అనేది మనకి పూర్తిగా తెలియడానికి అవకాసం లేదు. అందువలన వారు ప్రస్తుత నాగరికత కంటే అన్ని రంగాలలోనూ వెనకబడే ఉన్నారు అనుకోవడం తార్కికం కాదు.
శాస్త్ర ప్రగతి సరళము అనే వాదానికి ప్రతికూల ఉదాహరణలు మనకి ఎన్నో కనిపిస్తాయి, అందులో యోగా ఒకటి. 40-50 సంవత్సరాల క్రితం వరకూ కూడా యోగ విద్యని ఒక మూడ నమ్మకంగా పరిగణించేవారు. ఆయుర్వేదం మరో ఉదాహరణ. థైరాయిడ్, నడుము నొప్పి లాంటి పాశ్చాత్య వైద్య విధానం నయం చెయ్యాలని ఎన్నో వ్యాధులని ఆయుర్వేదం ఏంతో సులభంగా, చాలా తక్కువ ఖర్చుతో నయం చెయ్యగలదు. అలా బాగుపడ్డ వారు ఎందరో నాకు స్వయంగా తెలుసు. యోగ విద్య, ఆయుర్వేదం వంటివి, శాస్త్ర ప్రగతి చక్రీయం అని నిరూపించే సాక్షాలు. కనీసం కొన్ని వేల సంవత్సరాల క్రితం నాటి శాస్త్రాలు నేటి ఆధునిక శాస్త్రాల కంటే మెరుగైనవి అంటే, శాస్త్ర ప్రగతి సరళం కానట్లే కద. ఇవి మనకి తెలిసిన శాస్త్రాలు. ఇదే విధంగా మనకి అసలు తెలియని, కేవలం పేర్లు మాత్రం తెలిసిన ఎన్నో ఇతర శాస్త్రాలు ఉండటానికి అవకాసం ఉంది. అయితే కేవలం మన పురాణాలలోనో ఇంకో దగ్గరో ఈ శాస్త్రాల ప్రస్తావన ఉంది కాబట్టి వాటిని నమ్మాలి అని నేను అనడం లేదు. ఏ విధమైన పరిశోధనా చెయ్యకుండా, వాటిని మూఢ నమ్మకాలు అని కొట్టి పారేయ్యడాన్నే నేను వ్యతిరేకిస్తున్నాను.
అందువలన గ్రహణ కాలంలో నియమాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, కేవలం అవి ఇంతక ముందు కాలానికి చెందినవి అనో, పాశ్చాత్యులు ఇంకా గుర్తించలేదు అనో మూఢ నమ్మకాలు అనుకోవడం, మన మూఢత్వమే అవుతుంది కానీ హేతుబద్దమైన ఆలోచన అనిపించుకోదు.
దీనికి మరో కారణం ఆత్మాన్యూనత. ఇటువంటి వారికి తెలిసో, తెలియకుండానో పాశ్చాత్యుల కంటే మనం తక్కువ అనే భావన ఉంటుంది. ఐరోపా దేశాల వలస పాలనలో ఉన్న అన్ని దేశాలలోనూ ఈ పరిస్థితి ఉంటుంది. దీనికి భారతదేశం మినహాయింపు కాదు. అయితే మనకి గొప్ప చరిత్ర, సంస్కృతి, హిందూ ధర్మం ఉండటం వలన ఈ జాడ్యం నుండి, బహుసా త్వరగానే బయటపడతాం.
కాబట్టి భారతీయ గ్రహణ శాస్త్రం నిజామా కాదా అనేది ఖచ్చితంగా ఎవరమూ చెప్పలేము. అయితే నిజం అవ్వడానికే సంభావ్యత ఎక్కువగా ఉంది. నా కారణాలు
- గ్రహణ సమయంలో ప్రకృతిలో ఒక పెద్ద మార్పు జరుగుతోంది, దాని ప్రభావం వలన సముద్రపు అలలు ఎగసి పడటం మనం చూస్తున్నాం. కాబట్టి గ్రహణ ప్రభావం మనుషుల మీదా కూడా ఉండే అవకాసం ఉంది
- యోగ శాస్త్రం, ఆయుర్వేదం వంటి ఎన్నో గొప్ప శాస్త్రాలని ఇచ్చిన, గ్రహణ సమయాన్ని ఈరోజుకీ చిన్న కాగిత కలం సహాయం తో లెక్కించడానికి వీలైన పరిజ్ఞానాన్ని ఇచ్చిన సంస్కృతే ఈ గ్రహణ నియమాలని కూడా చెప్తోంది.
- వందల వేల సంవత్సరాలుగా ఈ నియమాలు మన సంస్కృతిలో భాగం అయిపోయాయి. కాబట్టి ఒక బలమైన, శాస్త్రీయమైన కారణం లేకుండా వాటిని తప్పు అని తెల్చేయ్యడం మూర్ఖత్వమే అవుతుంది
- ఈ నియమాలు పాటించడం వలన, లాభం సంగతి పక్కనబెడితే నష్టమైతే లేదు.
ఈ కారణాల వలన, ఈ నియమాలు తప్పు అని పూర్తి ఆధారాలతో నిరూపితం అయ్యే దాకా మనం నియమాలని పాటించడమే ఉత్తమం. నియమాలని పాటించడం, పాటించకపోవడం వ్యక్తిగత. అయితే, తమ మిడి మిడి జ్ఞానం తో ఇవన్ని తప్పు అని ప్రచారం చెయ్యడం మాత్రం తప్పు. ఈ పని ఎక్కువగా చేసే జన విజ్ఞాన వేదిక వారు కొంచెం పునరాలోచించు కోవాలి.
(Image credit: India Today)
Disclaimer: The opinions expressed in this article belong to the author. Indic Today is neither responsible nor liable for the accuracy, completeness, suitability, or validity of any information in the article.